భారీ వర్షాలు నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : ఎంపీ ధర్మపురి అర్వింద్

భారీ వర్షాలు నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : ఎంపీ ధర్మపురి అర్వింద్

జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన, చరవాణి ద్వారా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వర్షాల పరిస్థితిపై సమీక్షించారు. ​మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య, విద్యుత్, వాటర్ సప్లై, ఆర్‌అండ్ బీ, జాతీయ రహదారుల సంస్థ సహా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఎంపీ సూచించారు. జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల బలహీనమైన కట్టలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ​రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర వస్తువులు, స్వచ్ఛమైన తాగునీరు, తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

​వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎంపీ అర్వింద్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, వరద నీటిని దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.

 

Views: 14
Tags:

About The Author

Latest News