ఖిల్లా రామాలయంలో కన్నులపండువగా సీతారాముల కళ్యాణం
స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన కవిత దంపతులు
నేడు మధ్యాహ్నం 3 గంటలకు కవిత కీలక ప్రకటన?
ఇందూరు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చారిత్రక ఖిల్లా రఘునాథ ఆలయంలో (ఖిల్లా రాంమందిర్) శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. లోకకళ్యాణార్థం నిర్వహించిన ఈ వేడుకలో భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఆమె భర్త దేవనపల్లి అనిల్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
భక్తి పారవశ్యంలో ఇందూరు
వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన కళ్యాణ తంతులో కవిత దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆ దేవుడి ఆశీస్సులు అందాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ వేడుకలో జాగృతి రాష్ట్ర, జిల్లా నేతలు అంబాటి శ్రీనివాస్ గౌడ్, కరిపే రాజు, ఇరుమల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయంగా ‘కీలక’ మలుపు?
ఆధ్యాత్మిక వేడుక ఒక ఎత్తైతే, రాజకీయంగా కవిత చేయబోయే ప్రకటన ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తన మెట్టినిల్లయిన నిజామాబాద్ గడ్డ నుంచే కవిత కొత్త పార్టీ పేరును ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై జాగృతి వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్‌మీట్
నేడు మధ్యాహ్నం సరిగ్గా 2:30 గంటలకు నిజామాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉంది. దీంతో జాగృతి శ్రేణులు, జిల్లా ప్రజలు ఈ కీలక ప్రకటన కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

