నేడు ఏరాజ్ పల్లిలో ఉగాది కుస్తీ పోరు
బోధన్ మండలంలోని ఏరాజ్ పల్లిలో గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ దేవాదాస్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు గ్రామంలోని కుస్తీ అఖడా వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ, ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీలు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయని సర్పంచ్ వివరించారు. గ్రామీణ క్రీడలను, మన సంప్రదాయాలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఏటా ఈ వేడుకను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మేటి పహిల్వాన్లు ఈ పోటీల్లో తలపడనున్నారని, విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తామని ఉప సర్పంచ్ పవన్ రెడ్డి తెలిపారు.
ఈ కుస్తీ హంగామాను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, క్రీడాభిమానులు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని గ్రామ పాలకవర్గం కోరింది. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు వెల్లడించారు.

