సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడి స్వయం ప్రకటనపై నిరసన
జిల్లాలోని సర్పంచ్‌లు, 32 మండలాల ఫోరం అధ్యక్షులతో ఎలాంటి చర్చలు జరపకుండా ఒక వ్యక్తి తానే నిజామాబాద్ జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడినని స్వయంగా ప్రకటించుకోవడాన్ని ఫోరం బాధ్యులు తీవ్రంగా ఖండించారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి మాట్లాడుతూ... అందరి అభిప్రాయాలు తీసుకోకుండా, సమన్వయం లేకుండా చేసుకునే స్వయంప్రకటనలకు ఎలాంటి గుర్తింపు ఉండదని స్పష్టం చేశారు. జిల్లాలోని 300 మందికి పైగా సర్పంచ్‌ల సంపూర్ణ మద్దతు తమకే ఉందని ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల సమస్యల పరిష్కారానికి, సర్పంచ్‌ల హక్కుల సాధనకు నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. పంచాయతీల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు, స్థానిక ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పారు. ముందస్తు సమాచారం లేకుండా చేసే చెల్లని ప్రకటనలను ఎవరూ నమ్మవద్దని కోరారు. ఈ సమావేశంలో ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి అరికెల జనార్ధన్, ఉపాధ్యక్షురాలు చింతం ఉమారాణి సంజీవ్, వివిధ మండలాల ఫోరం అధ్యక్షులు వాసు, సుదర్శన్, భూమేశ్, శ్రీను, జలేందర్, రాజు, మోహన్, నీలిమా సాయగౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

