జానకంపేట్ లక్ష్మీనరసింహుని సన్నిధిలో కాంట్రాక్టుల వేలం
ఎడపల్లి మండలం జానకంపేట్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పలు సేవా విక్రయ కాంట్రాక్టుల బహిరంగ వేలం పాటలు నిర్వహించారు. వచ్చే అక్టోబర్ 10న శనివారం అమావాస్య పుణ్యదినం రానుండటంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పూజా సామాగ్రి, లడ్డూ-పులిహోర, కొబ్బరికాయలు, నవధాన్యాల విక్రయంతో పాటు సైకిల్ స్టాండ్ నిర్వహణకు ఈ వేలం పాటలు చేపట్టినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి గింజుపల్లి వేణు తెలిపారు. వేలం పాటల్లో తీవ్ర పోటీ నడుమ లడ్డూ, పులిహోర విక్రయించే హక్కులను నిజామాబాద్‌కు చెందిన జి.సురేష్ રૂ.47 వేలకు పాడుకున్నారు. కొబ్బరికాయలు, నవధాన్యాలు విక్రయించే హక్కులను జానకంపేట్ కు చెందిన ఎ.సిద్దు రూ. 55 వేలకు దక్కించుకోగా, సైకిల్ స్టాండ్ నిర్వహణ హక్కులను అదే గ్రామానికి చెందిన సుమన్ రూ.10 వేలకు పాడుకున్నారని ఈవో వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేలం దక్కించుకున్న వ్యాపారులు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ సుజాత రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చిలుక రవికుమార్, ఆలయ డైరెక్టర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

