అటవీశాఖ సిబ్బందికి నేర పరిశోధనపై శిక్షణ
కేసు నమోదు నుంచి నిందితులకు శిక్ష పడే వరకు పక్కా ఆధారాలతో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బందికి నేర పరిశోధన, కేసుల దర్యాప్తు, కోర్టు విచారణలో ప్రాసిక్యూషన్ అంశాలపై సీపీ కార్యాలయ కమాండ్ కంట్రోల్ హాల్‌లో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అటవీ నేరాల నియంత్రణలో పోలీస్, అటవీ శాఖల మధ్య పటిష్ట సమన్వయం ఉండాలని పేర్కొన్నారు. నూతనంగా అమల్లోకి వచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023 చట్టంలోని నిబంధనలు, ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి చార్జిషీట్ దాఖలు వరకు పాటించాల్సిన పద్ధతులను వివరించారు. నేర స్థలంలో లభించే భౌతిక, డిజిటల్ ఆధారాలను సేకరించి, వాటిని సురక్షితంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపే విధానాలపై అవగాహన కల్పించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో సాక్షులకు సమన్లు, వారెంట్ల అమలు సకాలంలో జరిగేలా పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్‌బీ ఏసీపీ బి.గురునాయుడు, ఇన్‌స్పెక్టర్ అంజయ్య, ఎస్బీ ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, మల్లేశం, ఎస్ఐ వరప్రసాద్ రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ బట్ తదితరులు పాల్గొన్నారు.
.jpeg)

