బాధితులకు సత్వర న్యాయం అందించాలి : జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా అధికారులు పక్కా ఆధారాలతో, నిర్ణీత వ్యవధిలో చార్జ్‌షీట్లు ఫైల్ చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆయన అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల వారీగా కేసుల పురోగతిని సమీక్షించిన ఆయన, గత సమావేశ నిర్ణయాల అమలుతీరుపై ఆరా తీశారు.
బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం, ఇతర సహాయ సహకారాలు అందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. కేసుల త్వరిత పరిష్కారానికి పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. దళిత, గిరిజన వర్గాల ప్రజలకు వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెలా ‘సివిల్ రైట్స్ డే’ను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సాంఘిక బహిష్కరణ వంటి అనాగరిక ఘటనలు చోటుచేసుకుంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములు ఆక్రమణకు గురైతే తమ దృష్టికి తీసుకురావాలని, 'భూభారతి' ద్వారా బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, జిల్లా రెవెన్యూ అధికారిణి గీత, జిల్లా సాంఘిక సంక్షేమాభివృద్ధి అధికారిణి రజిత, పలువురు ఏసీపీలు, కలెక్టరేట్ సిబ్బంది, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


