మొక్కలకు రాఖీ కట్టి.. మమకారం చాటుకొని..
పర్యావరణ పరిరక్షణతో పాటు మొక్కల పట్ల ప్రేమానురాగాలను పెంపొందించుకోవడమే ధ్యేయంగా సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘వృక్ష రక్షాబంధన్’ వేడుకను గురువారం ఘనంగా నిర్వహించారు. పచ్చని చెట్లే మానవాళికి శ్వాస అని చాటుతూ పాఠశాల ఆవరణలోని మొక్కలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంతో మమకారంతో రాఖీలు కట్టారు. నాటిన ప్రతి ఒక్క మొక్కను సొంత బిడ్డలా కాపాడుకుంటామని ఈ సందర్భంగా ప్రణామం చేసి ప్రతిజ్ఞ పూనారు. జీవశాస్త్ర ఉపాధ్యాయులు రుద్ర సంతోష్ యాదవ్, విఠల్ కాంబ్లేల ఆద్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ మాట్లాడుతూ... ప్రకృతి ప్రత్యక్ష దైవమని, భవిష్యత్ తరాల నివాసానికి చెట్లే కల్పతరువులని స్పష్టం చేశారు. విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై బాధ్యతను పెంచేందుకు ఇలాంటి పండుగలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్యోత్స్నా, విజయలక్ష్మి, అరుణ్ కుమార్, గంధం సాయిలు, అబ్బయ్య, సుధారాణి, స్వామి, రాజ్ కుమార్, లక్ష్మి, స్వర్ణ, విక్రమ్, శ్రీకాంత్‌లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

