సాలూరలో ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక అవగాహన
సాలూర మండల కేంద్రంలో ఎస్‌ఐఆర్-2026 ప్రత్యేక సవరణ ప్రక్రియపై గురువారం గ్రామసభను నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ మెహర్ ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఐ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్ ద్వారా కొత్త ఓటర్ల నమోదుతో పాటు జాబితాలోని తప్పుల దిద్దుబాటు, సవరణలకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. గ్రామస్తులు తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అధికారులకు అందజేయాలని కోరారు. అనంతరం బిఎల్‌ఓలు ఓటరు జాబితాలోని సవరణలు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోక్కం లావణ్య, రెవెన్యూ సిబ్బంది కళావతి, బూత్ స్థాయి అధికారులు భూమయ్య, సత్య గంగామణి, గోదావరి, మాధవి, సరోజ, శిల్ప, విజయ్ కుమార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

