ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజేతలుగా నిలవాలి
పదో తరగతి విద్యార్థులు పరీక్షల పట్ల భయాందోళనలు వీడి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసినప్పుడే అత్యుత్తమ ఫలితాలు సాధించగలరని తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లపు తులసీరామ్ పిలుపునిచ్చారు. బుధవారం బోధన్ డివిజన్ లోని స్థానిక కళాశాలలో విద్యార్థుల కోసం నిర్వహించిన పరీక్షల ప్రేరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా, దృఢ సంకల్పంతో చదవాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా చదివితే పదికి పది జీపీఏ సాధించడం అసాధ్యమేమీ కాదని స్పష్టం చేశారు. విద్యార్థులు తమను తాము ఇతరులతో పోల్చుకోకుండా, ప్రశాంతమైన మనసుతో సమయ పాలన పాటిస్తూ సంసిద్ధం కావాలని కోరారు. పరీక్ష రోజు ఉదయాన్నే సంతోషంగా నిద్రలేవాలని, కావాల్సిన సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పరీక్ష గదిలో ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి, తెలిసిన సమాధానాలను చక్కగా రాయడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు స్రవంతి, జ్యోతి, స్వాతిక, మౌనిక, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

