బోధన్ కేంద్రంగా భారీ నెట్‌వర్క్.. పోలీసుల ‘క్రాక్‌డౌన్’తో గుట్టురట్టు!
మూడు నెలల్లోనే రూ. 31 కోట్ల లావాదేవీలు చూసి పోలీసులు షాక్!
అమాయకులారా జాగ్రత్త.. మీ అకౌంట్ ఇస్తే మీరే బుక్కవుతారు: సీపీ హెచ్చరిక
అంతర్జాల వేదికగా సామాన్యుల సొమ్మును కొల్లగొడుతున్న ముఠాల ఆటకట్టించేందుకు జిల్లా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ సత్ఫలితాలనిచ్చింది. నకిలీ గుర్తింపు పత్రాలతో బ్యాంకు ఖాతాలను సృష్టించి, వాటిని సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను నిజామాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ అక్రమ ఖాతాల ద్వారా కేవలం మూడు నెలల్లోనే రూ. 31 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తించి అధికారులు విస్తుపోయారు.
వివరాల్లోకి వెళ్తే..
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దారి ఎంచుకున్నారు. వివిధ ఫోన్ నంబర్లు, నకిలీ ధ్రువీకరణ పత్రాలను ఉపయోగించి పెద్ద ఎత్తున వ్యాపార (కరెంట్) ఖాతాలను తెరిచారు. అనంతరం ఈ ఖాతాలను అంతర్జాల మోసగాళ్లకు కమీషన్ ప్రాతిపదికన విక్రయించారు. బాధితుల నుండి దోచుకున్న సొమ్మును ఈ ఖాతాల ద్వారానే చేరవేస్తున్నట్లు విచారణలో తేలింది.
అరెస్టు అయిన వారు...
బోధన్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అజర్, శ్యామల నవీన్, ఖాసిం పటేల్, మొహమ్మద్ మినాజ్ అహ్మద్, సయ్యద్ హఫీజ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కుంభకోణంలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.
నేరగాళ్లకు సహకరిస్తే కఠిన చర్యలు: సీపీ హెచ్చరిక
సైబర్ నేరాలు కేవలం కంప్యూటర్ల ముందు కూర్చుని చేసేవి మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న అమాయకుల బ్యాంకు ఖాతాలను వాడుకుని చేసే పెద్ద కుంభకోణాలు. తాజా కేసులో కేవలం 3 నెలల్లోనే 31 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రజలకు నా విజ్ఞప్తి: కొద్దిపాటి కమీషన్ వస్తుందని ఆశపడి మీ పేరు మీద బ్యాంకు ఖాతాలు తెరిచి ఇతరులకు ఇవ్వకండి. అపరిచితులకు మీ ఆధార్, పాన్ కార్డులు ఇస్తే, వారు వాటితో నకిలీ కంపెనీలు సృష్టించి కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నారు. గుర్తుంచుకోండి.. మీ ఖాతా ద్వారా నేరం జరిగితే, చట్టం ముందు మొదటి నేరస్తులు మీరే అవుతారు. కఠినమైన జైలు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది.
ఎవరైనా మీ అకౌంట్ అడిగినా లేదా అనుమానాస్పద లావాదేవీలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. సైబర్ నేరగాళ్ల ఆటకట్టించడంలో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం.

