భక్తి పారవశ్యంలో బోధన్.. వైభవంగా జగన్నాథ రథయాత్ర
అచన్‌పల్లి అలివేలు మంగమ్మ గుడి నుంచి టీటీడీ కళ్యాణ మండపం వరకు కొనసాగిన రథయాత్ర
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శ్రీ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. అచన్‌పల్లిలోని శ్రీ అలివేలు మంగమ్మ ఆలయం నుంచి టీటీడీ కల్యాణమండపం వరకు నిర్వహించిన ఈ యాత్ర భక్తి శ్రద్ధల మధ్య కోలాహలంగా సాగింది. ఈ రథయాత్ర మహోత్సవాన్ని బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి దంపతులు పూజలు చేసి ప్రారంభించారు. అచన్‌పల్లి నుంచి ప్రారంభమైన యాత్ర శక్కర్ నగర్, న్యూ బస్స్టాండ్, అంబేద్కర్ చౌక్ మీదుగా టీటీడీ కళ్యాణ మండపం వరకు కొనసాగింది. ఇస్కాన్ ప్రతినిధులు అశోక్ నిత్యదాస్, రాధిక మాతాజీ ఆధ్వర్యంలో జరిగిన రథయాత్రలో భాగంగా ఇస్కాన్ బృందం భక్తులకు సుమారు 1,10,000 కాకినాడ కాజాలను ప్రసాదంగా అందజేశారు. రథయాత్రలో చిన్నారుల కూచిపూడి, భరతనాట్యం, కోలాట ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హరేకృష్ణ, హరే రామ నామస్మరణతో పట్టణ వీధులు మారుమోగాయి. యాత్ర ముగింపులో భక్తులకు అన్నదాన ప్రసాద పంపిణీ చేశారు.




