మండల్ స్ఫూర్తితో.. బెంగళూరులో ఓబీసీల జాతీయ సదస్సు
ఆగస్టు 7న మహాసభ
మండల్ కమిషన్ సిఫార్సుల అమలు దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా ఉన్న 80 కోట్ల మంది ఓబీసీల సమస్యల పరిష్కారం, రాజకీయ అధికార సాధనే ధ్యేయంగా వచ్చే నెల 7న బెంగళూరులో 11వ జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం ప్రకటించింది. గత 11 ఏళ్లుగా జాతీయ స్థాయిలో ఈ మహాసభలను నిర్వహిస్తున్న క్రమంలో, ఈసారి బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ సభ జరగనుంది.
రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఏకతాటిపైకి రావాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ మహాసభకు దేశంలోని 29 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారని రాష్ట్ర కార్యదర్శి ఆకుల ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మహాసభకు సంబంధించిన కరపత్రాలను సంఘం నేతలు ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్సా ఆంజనేయులు మాట్లాడుతూ మండల్ కమిషన్ సిఫార్సుల స్ఫూర్తితో ఓబీసీల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోల్కం గంగా కిషన్, దర్శనం దేవేందర్, కరిపే రవీందర్, మాడవేడి వినోద్ కుమార్, శ్రీలత, అపర్ణ, చంద్రమోహన్, రిటైర్డ్ ఎంపీడీవో గౌస్ మొహియుద్దీన్, దారం భూమన్న, గంగాధర్, సురేందర్, మహేష్, సత్యనారాయణ, రవి, శ్రీనివాస్ తదితర నేతలు పాల్గొన్నారు.

