యువత చైతన్యంతోనే మాదకద్రవ్యాల రహిత సమాజం సాధ్యం : రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. విద్యాసంస్థల్లో అవగాహన పెంచాలి
నిజామాబాద్‌లో ఘనంగా 'యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం'
మత్తు పదార్థాల మహమ్మారిని తుదముట్టించి నశాముక్త తెలంగాణను, నశాముక్త భారత్‌ను నిర్మించడంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, నవకల్పనలు, దేశసేవ వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. మంగళవారం నిజామాబాద్‌లోని భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా నిర్వహించిన యాంటీ డ్రగ్ అవగాహన సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నశాముక్త భారత్ అభియాన్ ఒక బృహత్తర ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటోందన్నారు. మాదకద్రవ్యాలపై చట్టపరమైన చర్యలతో పాటు యువతలో అవగాహన, చైతన్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడం ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ‘ఈగిల్’ కార్యక్రమంతో పాటు నిజామాబాద్ పోలీసు శాఖ చేస్తున్న కృషి అత్యంత ప్రశంసనీయమని అభినందించారు. విద్యాసంస్థల్లో ప్రహరీ క్లబ్‌లు, యాంటీ డ్రగ్ కమిటీల ఏర్పాటు ద్వారా విద్యార్థులను చైతన్యవంతం చేయడం శుభపరిణామమన్నారు. విద్యాసంస్థల పరిసరాల్లో హానికర పదార్థాల లభ్యతను కఠినంగా నియంత్రించడంతో పాటు, బాధితులకు చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
యువతే దేశానికి అసలైన బలం యువతలోని శక్తి, నైపుణ్యాలే దేశానికి అతిపెద్ద సంపద అని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మాదకద్రవ్యాలకు బలి చేయవద్దని గవర్నర్ విద్యార్థులకు హితవు పలికారు. స్వామి వివేకానంద సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ‘నశాకు నో.. జీవితానికి ఎస్’ అనే నినాదాన్ని ప్రతి యువకుడు తన జీవిత సంకల్పంగా మార్చుకోవాలని కోరారు. పిల్లలతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం సంభాషిస్తూ ఆప్యాయతతో మార్గదర్శనం చేయాలని సూచించారు. ఆరోగ్యవంతమైన యువతే బలమైన సమాజాన్ని నిర్మిస్తుందని, బలమైన సమాజమే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేస్తుందని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వల్ల సర్వం వినాశనమవుతుందని, యువత వాటికి దూరంగా ఉండాలని కోరారు. అంతకుముందు లక్ష మంది సంతకాలతో కూడిన యాంటీ డ్రగ్ అవగాహన ఫ్లెక్సీని గవర్నర్ ఆవిష్కరించి, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. నషా ముక్త్ వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు గవర్నర్ మెమెంటోలు అందజేసి అభినందించారు. ఈ సదస్సులో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, మేయర్ ఉమారాణి, ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా, పి. రాకేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తదితరులు పాల్గొన్నారు.


