రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించండి : ఎమ్మెల్యే భూపతి రెడ్డి
నిధుల వినియోగంలో వేగం పెంచాలి
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన '99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక'ను సర్పంచులు చిత్తశుద్ధితో అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో నూతన సర్పంచులకు ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కనీసం 70 శాతాన్ని తక్షణమే వెచ్చించి, మార్చి నెలాఖరులోగా వినియోగ ధృవీకరణ పత్రాలు సమర్పించాలని ఆదేశించారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో పల్లెల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
అనంతరం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్ పదవి గ్రామ స్థాయిలో ఎంతో విశిష్టమైనదని, రాజకీయ వైషమ్యాలను పక్కనబెట్టి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరారు. ముఖ్యంగా మహిళా సర్పంచులు గ్రామ పర్యటనలు చేస్తూ సమస్యలను నేరుగా తెలుసుకోవాలని, ఇందిరమ్మ ఇళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణలో క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కులాల వారీగా కాకుండా ఉమ్మడి కమ్యూనిటీ హాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే బాధ్యత సర్పంచులదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ, జడ్పీ సీఈఓ, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


