ఈతవనంపై దుండగుల దాష్టీకం
60 చెట్లు నరికివేత.. ఆపై దహనం : జీవనోపాధి కోల్పోయామని గీత కార్మికుల ఆవేదన
ఎక్సైజ్ సీఐకి ఫిర్యాదు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పరిధిలోని పసుపువాగు సమీపంలో దుండగులు బరితెగించారు. గీత కార్మికుల జీవనాధారమైన ఈతవనాన్ని లక్ష్యంగా చేసుకొని ఘాతుకానికి ఒడిగట్టారు. సుమారు 60 ఈత చెట్లను నరికివేయడమే కాకుండా, వాటికి నిప్పుపెట్టి దహనం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధిత గీత కార్మిక సంఘం నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. పసుపువాగు ప్రాంతంలోని సర్వే నంబరు 594లో గల 8 ఎకరాల 6 గుంటల భూమి గీత కార్మిక సంఘానికి చెందింది. ఈ భూమిలో కార్మికులు ఈతవనాన్ని పెంచుకుంటూ కల్లు గీత ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. కాగా, శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు వనంలోకి చొరబడి యథేచ్ఛగా 60 వరకు ఈత చెట్లను నరికివేసి, అనంతరం వాటిని తగులబెట్టారు.
కన్నీరుమున్నీరవుతున్న కార్మికులు
ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న చెట్లు కళ్ల ముందే బూడిదవడంతో గీత కార్మికులు తల్లడిల్లిపోతున్నారు. తమ ఉపాధిని దెబ్బతీసి, పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం బోధన్ ఎక్సైజ్ సీఐ భాస్కరరావుకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పి. గంగాధర్ గౌడ్, బి. లింగాగౌడ్, కందుకాల శ్రీకాంత్ గౌడ్, వై. జీవన్ గౌడ్, వై. రమేష్ గౌడ్, ఎం. రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


