ధర్మపురి అర్వింద్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం : గవర్నర్ శివప్రతాప్ శుక్లా
ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా
53 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ.. రక్తదాన శిబిరం ప్రారంభం
సమాజంలో నిరుపేదలకు, ఆపదలో ఉన్న వారికి చేయూత అందించడమే ధ్యేయంగా ధర్మపురి అర్వింద్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా కొనియాడారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం సమీపంలోని పీహెచ్‌ఆర్ కన్వెన్షన్‌లో మంగళవారం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గుండె సంబంధిత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేద చిన్నారులు, ఇతర లబ్ధిదారులు కలిపి మొత్తం 53 మందికి గవర్నర్ చేతుల మీదుగా ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పేదరికంతో వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు, క్షేత్రస్థాయి పార్టీ కార్యకర్తలకు ఫౌండేషన్ ద్వారా ఆసరాగా నిలవడం అభినందనీయమన్నారు. సామాజిక సేవ ద్వారా లభించే ఆత్మసంతోషం వెలకట్టలేనిదని పేర్కొన్నారు.
ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ... ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఫౌండేషన్‌ను స్థాపించినట్లు తెలిపారు. వైద్య సాయం అవసరమైన చిన్నారులకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తరిస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు. రక్తదానంతో ఎందరో ప్రాణాలను కాపాడొచ్చని, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి దాన కిషోర్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ (నిజామాబాద్ అర్బన్), రాకేష్ రెడ్డి (ఆర్మూర్), బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



