ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా రేపు బోధన్ లో ప్రైవేట్ విద్యాసంస్థల బంద్
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డిని పదో తరగతి చదువుతున్న విద్యార్థులే దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, కలకలాన్ని రేపింది. విద్యను నేర్పించి భవిష్యత్తుకు బాటలు వేసే గురువుపైనే స్వల్ప విషయాలకే కక్ష పెంచుకుని హత్యకు ఒడిగట్టడం సమాజంలో క్షీణిస్తున్న మానవీయ విలువలకు, ఉపాధ్యాయులకు భద్రత లేని పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఘోర ఉదంతాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఉపాధ్యాయుల భద్రతకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ బోధన్‌లోని మహాలక్ష్మి కల్యాణ మండపంలో గురువారం ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అశ్రునివాళులు అర్పించిన యాజమాన్యాలు, ఈ దారుణానికి నిరసనగా రేపు బోధన్ డివిజన్ వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. బోధన్ సమావేశంలో ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఎదురవుతున్న తీవ్ర సవాళ్లు, విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యంపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వాడకం విపరీతంగా పెరిగిపోవడం, సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల విద్యార్థులు చిన్న వయసులోనే దారితప్పి నేర స్వభావాన్ని పెంపొందించుకుంటున్నారని విద్యాసంస్థల ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులను ఉపాధ్యాయులు క్రమశిక్షణలో ఉంచేందుకు స్వల్పంగా మందలిస్తే, వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు తల్లిదండ్రులు పాఠశాలలకు వచ్చి గొడవలకు దిగుతున్నారని, దీనివల్ల పిల్లల్లో తప్పుడు ధైర్యం పెరిగి ఉపాధ్యాయుల మాట వినని పరిస్థితి దాపురిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మార్కుల సాధనే ధ్యేయంగా కాకుండా విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాలలతో పాటు తల్లిదండ్రులు, సమాజం కలిసికట్టుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. బస్టాండ్లు, బహిరంగ ప్రదేశాల్లో విద్యార్థులు తప్పుదోవ పడుతుంటే మీడియా ప్రతినిధులు, ప్రజలు స్పందించి పాఠశాల యాజమాన్యాలకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మహాలక్ష్మి కళ్యాణ మండపం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం సమర్పించనున్నట్లు ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ విద్య సంస్థల యాజమాన్యాలు పాల్గొన్నారు. .jpeg)


