బాలికలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి : డీహెచ్ఈడబ్ల్యు కోఆర్డినేటర్ స్వప్న
బాలికలు అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదిగినప్పుడే సమాజ ప్రగతి సాధ్యమవుతుందని జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న స్పష్టం చేశారు. బోధన్ పట్టణంలోని ఆజం గంజ్ హైస్కూల్‌లో జిల్లా మహిళా సాధికారత కేంద్రం, న్యాయ సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ‘బేటీ బచావో – బేటీ పడావో’ సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ... బాలికల విద్య, రక్షణ, సాధికారతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో వేరూనుకుపోయిన బాల్య వివాహాల దురాచారాన్ని అరికట్టడంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ముందుండాలన్నారు.
బాలల హక్కుల పరిరక్షణ సభ్యురాలుపద్మసింగ్ మాట్లాడుతూ... బాలికలపై ఎలాంటి వివక్ష చూపకుండా సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. బాలలపై హింస, వేధింపులు లేదా బాల్య వివాహాలు వంటి సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులను సంప్రదించి, న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సాయం పొందవచ్చని సూచించారు. సమాజంలో మహిళల రక్షణ, బాలల హక్కుల చట్టాలపై విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.


