ఆత్మవిశ్వాసంతో వైకల్యాన్ని జయించాలి
అంధుల చదువుకు బ్రెయిలీ సేవలు ఆదర్శం
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి
ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి వైకల్యాన్నైనా సునాయాసంగా జయించవచ్చని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి అన్నారు. వైకల్యాన్ని చూసి నిరాశ చెందకుండా ప్రత్యేక నైపుణ్యాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని తారకరామ్ నగర్‌లో గల ‘స్నేహ సొసైటీ’ ప్రత్యేక పాఠశాలలో నూతనంగా నిర్మించిన తరగతి గదుల భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక పాఠశాలలో విద్యార్థుల బోధనా పద్ధతులు, మౌలిక వసతులను పరిశీలించి మాట్లాడారు. దృష్టిలోపం ఉన్నవారు సులువుగా చదువుకునేలా బ్రెయిలీ లిపిని ఆవిష్కరించిన లూయిస్ బ్రెయిలీ సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ప్రత్యేక పిల్లలకు మేలైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను, స్నేహ సొసైటీ ప్రతినిధులను అభినందించారు. పాఠశాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు సహకారం అందిస్తానని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని భూపతిరెడ్డి తెలిపారు. విద్యపై చేసే వ్యయాన్ని భవిష్యత్ తరాల కోసం పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు రూ.200 కోట్లతో ‘యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్’ను నిర్మిస్తున్నామని, ప్రతి మండలంలో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
అనంతరం స్నేహ సొసైటీ ప్రతినిధి సిద్ధయ్య, ఉపాధ్యాయులు గంగారం, విజయానంద్, దయానంద్, ఇతర సిబ్బందిని ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సత్కరించారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యేను పూలమాలలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు అమృతాపూర్ గంగాధర్, ఉమ్మాజి నరేష్, జనార్దన్, మోహన్, జలందర్, స్నేహ సొసైటీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


