కందకుర్తి పుష్కర ఘాట్లను పరిశీలించిన సీపీ సాయి చైతన్య
రాబోయే 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశించారు. బుధవారం రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందకుర్తి వద్ద గల గోదావరి పుష్కర ఘాట్లను ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఘాట్ల వద్ద ఏర్పాట్లు, మహిళల కోసం ప్రత్యేకంగా దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఘాట్ల వద్దకు వచ్చే దారులు, వెళ్లే మార్గాలను క్రమబద్ధీకరించాలని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా విశాలమైన పార్కింగ్ ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. నదిలో స్నానాలకు వచ్చే భక్తులు ప్రమాదాల బారిన పడకుండా, ప్రాణనష్టం జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గత పుష్కరాల సమయంలో ఎదురైన లోటుపాట్లు, సమస్యల గురించి సీపీ స్థానిక గ్రామస్తులతో స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి అవరోధాలు కలగకుండా ముందస్తుగా సమగ్ర ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, రెంజల్ ఎస్సై కె. చంద్రమోహన్, కందకుర్తి ఉపసర్పంచ్ నాగేష్ మరియు ఇతర పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

