ఖైదీలు సన్మార్గంలో నడవాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి
By R.Suresh
On
జిల్లా కారాగారంలోని ఖైదీలు క్రమశిక్షణతో మెలగాలని, విడుదలయ్యాక సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జీవిఎన్ భారత లక్ష్మీ పేర్కొన్నారు. మంగళవారం ఆమె జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పీ.సాయిసుధతో కలిసి నిజామాబాద్ జిల్లా జైలును ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీల ఆరోగ్య స్థితిగతులను, జైలులో వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
ఉచిత న్యాయ సాయాన్ని వినియోగించుకోవాలి
రెండు, మూడు నెలలుగా జైలులో ఉండి, ఆర్థిక స్తోమత లేక బెయిల్ దరఖాస్తు చేసుకోలేని ఖైదీల వివరాలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. సొంతంగా న్యాయవాదులను నియమించుకోలేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా ప్రభుత్వ న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయ సహాయం అందుతుందని స్పష్టం చేశారు.
మద్యం మత్తులో వాహనాలు నడిపితే లైసెన్సులు రద్దు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రిమాండ్‌కు వచ్చిన ఖైదీలతో న్యాయమూర్తి ప్రత్యేకంగా మాట్లాడారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టినట్లవుతుందని హెచ్చరించారు. "మళ్లీ ఇలాంటి తప్పులు పునరావృతమైతే డ్రైవింగ్ లైసెన్సులతో పాటు వాహన రిజిస్ట్రేషన్ (ఆర్సీ)లను కూడా రద్దు చేయిస్తాం" అని గట్టిగా మందలించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి (సీనియర్ సివిల్ జడ్జ్), జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్ (డిఎస్పీ) పి.అశోక్ కుమార్, ఏ. శ్రీనివాస్ రెడ్డి, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మరియు జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 17
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

