లక్ష్యాలకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రాజశ్రీ
జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పగడ్బందీగా అమలు చేస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆమె ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, ఆర్‌బీఎస్‌కే వైద్యులు మరియు ఇతర సిబ్బందితో జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్పెషాలిటీ వైద్యులతో నిర్వహించే శిబిరాలను విజయవంతం చేయాలని రోగుల నమోదును విభాగాల వారీగా పక్కాగా చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న దృష్ట్యా, క్షేత్రస్థాయి సిబ్బంది విధుల్లో ఖచ్చితమైన సమయపాలన పాటించాలని హెచ్చరించారు. మాతా శిశు మరణాలు సంభవించకుండా గర్భిణీలకు నాలుగు విడతల పరీక్షలు నిర్వహించడంతో పాటు, ప్రమాదకర లక్షణాలున్న వారిని గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఎన్‌సీడీ కింద 30 ఏళ్లు పైబడిన వారందరికీ బీపీ, షుగర్, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసి, ఆభా కార్డులను జనరేట్ చేయాలన్నారు. నూరు శాతం వ్యాధి నిరోధక టీకాలు వేయాలని, పెండింగ్‌లో ఉన్న జాబితాలను సేకరించి ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయాలని ఆదేశించారు. సిబ్బంది అందరూ ఏబీఏఎస్ ద్వారా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని అటెండెన్స్ మరియు మూమెంట్ రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్వేత, డాక్టర్ వెంకన్న, డాక్టర్ శిఖరా, డాక్టర్ శ్రావ్య, డీపీఓ విశాల, డీడీఎం నారాయణ, పృథ్వి, వెంకటేశ్వర్లు, క్వాలిటీ మేనేజర్ రాము తదితరులు పాల్గొన్నారు.

