గర్భిణీల నమోదు పకడ్బందీగా ఉండాలి : డిఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రాజశ్రీ
12 వారాల్లోపే పేరు నమోదు చేయాలి
జిల్లాలో గర్భిణీ స్త్రీల నమోదు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో ఎక్కడా అలసత్వం ప్రదర్శించకూడదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో నమోదు తక్కువగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో ఆమె ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... ప్రతి ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో ఏఎన్ఎంలు, ఆశాలు ప్రతిరోజూ గృహ సందర్శన చేస్తూ జనాభా వివరాలను హౌస్ హోల్డ్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. సరైన డేటా అందుబాటులో ఉంటేనే నివేదికల తయారీ సులభమవుతుందని, ముఖ్యంగా గర్భం దాల్చిన 12 వారాల లోపే వారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ, కొత్తగా పెళ్లిళ్లు అయిన వారిని మరియు ఒకటి లేదా ఇద్దరు సంతానం ఉన్న దంపతులను నిత్యం పర్యవేక్షించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. 49 ఏళ్లు దాటిన మహిళలను అర్హులైన దంపతుల జాబితా నుండి తొలగించాలని ఎల్ఎంపి రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. గర్భిణీల నమోదు తక్కువగా ఉన్న ఎడపల్లి, సాలూర, పెగడపల్లి, దేవగావ్, డోన్ కేశ్వర్, జక్రంపల్లి, వేల్పూరు పీహెచ్‌సీల ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, ఎంఎల్ హెచ్ పిల పనితీరును ఆమె ప్రత్యేకంగా సమీక్షించడమే కాకుండా, వారు వెంట తెచ్చుకున్న రిజిస్టర్లను స్వయంగా తనిఖీ చేశారు. ప్రతి వెయ్యి జనాభాకు నెలకు సగటున ఇద్దరు గర్భిణీలు నమోదయ్యే అవకాశం ఉంటుందని, ఆ దిశగా ఆశాలు తమ పరిధిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్వేత, ఎన్‌సీడీ అధికారి డాక్టర్ వెంకన్న, డిడిఎం నారాయణ, హెచ్‌ఈఓ శ్రీనివాస్, డిహెచ్‌ఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


