గణేష్, దేవీ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలి
రాబోయే వినాయక చవితి, దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించే గణేష్, దుర్గామాత మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విహెచ్‌పి, బజరంగ్ దళ్ నాయకులు మాట్లాడుతూ... విద్యుత్ శాఖ అధికారులు అనవసరంగా మండపాల నిర్వాహకులను వేధించవద్దని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. అలాగే విగ్రహాల ఊరేగింపు సాగే దారుల్లో రోడ్లపై ఏర్పడిన గుంతలకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని పండుగ రోజుల్లో విద్యుత్ అంతరాయం మరియు షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం సమయంలో ధోబీఘాట్ రోడ్డు నుండి గుండ్ల చెరువు వరకు తగినంత లైటింగ్ సదుపాయాలు కల్పించాలని, నిమజ్జనం కోసం మున్సిపాలిటీ తరఫున క్రేన్లను అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా విశేష సంపర్క ప్రముఖ్ అల్జాపూర్ అక్షయ్, నగర కార్యదర్శి కొంగి రవి, ఉపాధ్యక్షుడు ప్రేమ్, సత్సంగ్ ప్రముఖ్ సచిన్, బజరంగ్ దళ్ ప్రతినిధులు అరవింద్, సాయి, అనురాగ్, రిషి, లింబాద్రి, శంకర్, మణికంఠ, నిఖిల్ మరియు బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

