గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకాలు
మహిళా దినోత్సవం రోజున జిల్లాలో ప్రారంభం
గర్భాశయ క్యాన్సర్‌ను నివారించేందుకు 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాలను అందించనున్నట్లు నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ప్రారంభించనున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి జిల్లాలోని వైద్యాధికారులు, పీహెచ్‌సీ పర్యవేక్షణ అధికారులు, వైద్య సిబ్బందితో జూమ్ సమావేశం నిర్వహించి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌తో పాటు ఇతర జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. హెచ్‌పీవీ అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అని, ఇది పునరుత్పత్తి మార్గంలో వచ్చే సాధారణ సంక్రమణ వైరస్ అని పేర్కొన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ప్రధాన కారణం ఈ వైరస్ అని వివరించారు.
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, రాష్ట్రంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించినట్లు తెలిపారు. భారతదేశ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తర్వాత అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ కావడంతో దీనిని అరికట్టేందుకు హెచ్‌పీవీ టీకాలు వేయడం జరుగుతున్నట్లు చెప్పారు.
జిల్లాలో 14 ఏళ్ల వయస్సు గల 12,363 మంది బాలికలకు ఈ టీకాను అందించనున్నట్లు తెలిపారు. మొదటగా మార్చి 8న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు అందించనుండగా, అనంతరం అన్ని పీహెచ్‌సీలలో కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.
హెచ్‌పీవీ వ్యాక్సిన్ గార్డసిల్–4 సాధారణంగా రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ఖరీదు చేస్తుందని, ప్రభుత్వ ఆధ్వర్యంలో అర్హులైన బాలికలకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. టీకా వల్ల సంతానం కలగదని, గర్భస్రావాలు జరుగుతాయని వంటి అపోహలను నమ్మవద్దని, ఇది పూర్తిగా సురక్షితమైన టీకా అని స్పష్టం చేశారు. 2011 మార్చి 7 నుంచి 2012 మార్చి 8 మధ్య జన్మించిన బాలికలందరికీ ఈ టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, జిల్లా ఉప వైద్యాధికారులుడాక్టర్ రవీందర్, డాక్టర్ సమత, డాక్టర్ అశ్విని, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్వేత, డాక్టర్ వెంకన్న, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శ్రావ్య, డీపీఓ విశాల, డీహెచ్‌ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, ఫార్మసీ అధికారి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

