బోధన్‌లో వేద ధర్మ ప్రచార యజ్ఞ మహోత్సవాలు ప్రారంభం
ఆర్య సమాజం, దయానంద గోశాల ఆధ్వర్యంలో వేడుకలు
ఈ నెల 26 నుంచి 30 వరకు నిర్వహణ
వేద ధర్మ ప్రచారంలో భాగంగా బోధన్‌లోని ఆర్య సమాజం, దయానంద గోశాల ఆధ్వర్యంలో ‘శ్రావణీ ఉపాకర్మ - వేద ధర్మ ప్రచార యజ్ఞ మహోత్సవాలు’ ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ నెల 30 వరకు వేదమంత్రోచ్ఛారణల నడుమ కొనసాగనున్నాయి. తెనాలికి చెందిన యజ్ఞ బ్రహ్మ పండిత్ శ్రీమాన్ మాథురి కృష్ణమూర్తి పర్యవేక్షణలో ఈ యజ్ఞ ప్రక్రియలు జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10:30 గంటల వరకు వేద పారాయణము, యజ్ఞము నిర్వహిస్తున్నారు. అలాగే సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8 గంటల వరకు యజ్ఞంతో పాటు భక్తులకు వేద ప్రవచనాలు అందించనున్నారు. అనంతరం భక్తులందరికీ సాయంత్రం భోజన ప్రసాద వితరణ ఉంటుంది. ఈ నెల 28 శుక్రవారం శ్రావణ పౌర్ణమి ఉదయం 8 గంటలకు యజ్ఞోపవీతధారణ, విశేష యజ్ఞం, ‘ఓం’ ధ్వజారోహణం మరియు రక్షాబంధన వేడుకలు నిర్వహించనున్నారు. అదేవిధంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరులకు ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించనున్నారు. వేడుకల ముగింపు సందర్భంగా ఆగస్టు 30 ఉదయం 8 గంటల నుంచి సామూహిక యజ్ఞం, పూర్ణాహుతి కార్యక్రమం చేపడతారని ఆర్య సమాజం ప్రతినిధులు తెలిపారు.

