ఆలయాల వద్ద భక్తులకు మౌలిక వసతులు కల్పించాలి
ఈ నెల 17న జరగనున్న నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా మౌలిక వసతులు కల్పించాలని బోధన్ పట్టణంలోని 15వ వార్డు కౌన్సిలర్ గుమ్మల అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన బోధన్ తహసీల్దార్ విట్టల్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. బోధన్ పట్టణంలోని ఏకచక్రనగర్ కాలనీలో వెలసిన శ్రీ సంతాన నాగమ్మ, శ్రీ శివ బసవేశ్వర ఆలయాల వద్ద శ్రావణమాస నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతాయన్నారు. పండుగ రోజున పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, ఆడపడుచులు, చిన్నారులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అయితే ప్రస్తుతం వర్షాల కారణంగా ఆలయ ప్రాంగణమంతా బురదమయంగా మారిందని, భక్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ఆలయ పరిసరాల్లో మొరం వేసి నేలను చదును చేయాలని, భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. పండుగకు ముందే అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

