బోధన్‌లో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’కు శ్రీకారం
35వ వార్డులో ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ
99 రోజుల పాటు క్షేత్రస్థాయిలో వార్డుల పర్యవేక్షణ
ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతూ, పారదర్శక పాలనను వారి ముంగిటకే చేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమం’ బోధన్ పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రూపొందిన ఈ బృహత్తర కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆదేశాల మేరకు 35వ వార్డులో శుక్రవారం శ్రీకారం చుట్టారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మశారత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. మే 6 నుంచి జూన్ 12 వరకు దశలవారీగా కొనసాగనున్న ఈ ప్రణాళికలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడం, మున్సిపల్ రికార్డులను సమగ్రంగా సమీక్షించడం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వివరించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వాటికి తక్షణ పరిష్కారం అందించడమే ఈ 99 రోజుల లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం కార్యక్రమ విజయవంతం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సామూహిక ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో మేనేజర్ రమేష్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ గణేష్‌లతో పాటు వార్డు కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, అంకు దాము, పౌల్, జావేద్, యం.దివ్య, అనీఫ్, గౌస్, ముషీర్ బాబా, మోబిన్, అజార్, లక్ష్మి, మున్సిపల్ ఏఈలు శ్రీనివాస్, ముఖ్యేర్, మెప్మా మరియు ఐకెపి విభాగాల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.


