అంతర్జాతీయ పోటీలకు అరిష్మ.. ఆర్థికంగా చేయూతనివ్వండి
టర్కీ వెళ్లడానికి నిధుల కొరత..
నిజామాబాద్ జిల్లా విద్యార్థిని దీనస్థితి
అది నిజామాబాద్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం.. ఆ ఇల్లు చాలా సామాన్యమైంది. కానీ ఆ ఇంటి బిడ్డ కన్న కలలు మాత్రం ఆకాశమంత. పట్టుదలే ఊపిరిగా, కష్టాలనే మెట్లుగా మార్చుకుని, చూపు సవాలుగా మారినా గురి తప్పని క్రీడాకారిణిగా ఎదిగింది ఎర్రం అరిష్మ. అంతర్జాతీయ గోల్‌బాల్ పోటీలకు ఎంపికై దేశం తరపున ఆడేందుకు సిద్ధమైన ఈ క్రీడాకారిణి ప్రయాణానికి ఇప్పుడు పేదరికం పెద్ద అడ్డంకిగా మారింది.
చూపు లేకపోయినా.. లక్ష్యం వైపు అడుగులు
సాలూర మండలం హున్సా గ్రామానికి చెందిన ఎర్రం రాజు, కవిత దంపతుల కుమార్తె అరిష్మ. పుట్టుకతోనే దృష్టి లోపం ఉన్నా, ఆమె ఎప్పుడూ కుంగిపోలేదు. చిన్నజీయర్ స్వామి స్థాపించిన నేత్ర కళాశాలలో విద్యనభ్యసిస్తూనే గోల్‌బాల్ క్రీడలో అద్భుత ప్రతిభ కనబర్చింది. సంమ్లిత ఫౌండేషన్ ఇచ్చిన శిక్షణతో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రత్యర్థులను చిత్తు చేసి ఇప్పుడు ఏప్రిల్ 6న టర్కీ దేశంలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది.
దాతల చేయూత కోసం ఎదురుచూపులు
టర్కీ వెళ్లడం అంటే కేవలం విమానం ఎక్కడం కాదు.. అది ఒక నిరుపేద తండ్రి కల, ఒక గ్రామీణ విద్యార్థిని పట్టుదల. కానీ ఆ విదేశీ ప్రయాణ ఖర్చులు, అక్కడ ఉండటానికి అయ్యే వ్యయం ఆ కుటుంబానికి భారంగా మారింది. నా బిడ్డ దేశం తరపున ఆడి పతకం తేవాలని ఉంది, కానీ మా ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు అని ఆమె తల్లిదండ్రులు కళ్ళ నీళ్ళతో వేడుకుంటున్నారు. ఒక సామాన్య రైతు బిడ్డ అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలంటే మనందరి సహకారం అవసరం. దాతలు, ప్రజా ప్రతినిధులు, మరియు స్వచ్ఛంద సంస్థలు మానవత్వంతో స్పందించి అరిష్మను ఆర్థికంగా ఆదుకోవాలని హున్సా గ్రామస్థులు కోరుతున్నారు. చిన్న సహాయం ఒక గొప్ప క్రీడాకారిణి భవిష్యత్తును మార్చగలదు.

