గిరిజన తండాల అభివృద్ధికి ఐక్యంగా సాగుదాం
సంత్ సేవాలాల్ ఆశయాలను కొనసాగిద్దాం
రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు - రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన బాటలో గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రహత్ నగర్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి, భోగ్ బండారు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి, సుమారు 500 తండాలను చుట్టి గిరిజనుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు సేవాలాల్ అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా వారం రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని, వచ్చే ఏడాది 5 వేల మందితో వేడుకలు జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తన వంతుగా ఉత్సవాల కమిటీకి రూ. 50 వేల విరాళాన్ని ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సహకారంతో ఈ ప్రాంతంలో రూ. 200 కోట్లతో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను నిర్మించబోతున్నామని, త్వరలోనే అర్హులకు రూ. 4 వేల చొప్పున కొత్త పింఛన్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్న ఈ కార్యక్రమంలో భీమ్‌గల్ మున్సిపల్ చైర్మన్ బొదిరే నాగమణి, తహసీల్దార్ షబ్బీర్, ఎంపీడీవో సంతోష్ కుమార్, సర్పంచ్ తిరుపతి, వివిధ శాఖల అధికారులు, భారీ సంఖ్యలో గిరిజన నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.


