హజ్ యాత్రికులకు పకడ్బందీగా వైద్య పరీక్షలు
జిల్లాలో 340 మందికి టీకాల పంపిణీ: డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రాజశ్రీ
నిజామాబాద్ జిల్లా నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల ఆరోగ్య పరిరక్షణకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని మొత్తం 340 మంది హజ్ యాత్రికులకు ప్రత్యేక రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి, ముందస్తుగా టీకాలు వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ బి.రాజశ్రీ తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న యాత్రికులకు ఈ నెల 17వ తేదీ వరకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షల్లో భాగంగా యాత్రికుల ఎత్తు, బరువు కొలతలతో పాటు రక్త, మూత్ర పరీక్షలు ఇతర క్లినికల్ తనిఖీలను వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు.
పరీక్షల అనంతరం శారీరకంగా, మానసిక దృఢత్వం కలిగి ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించబడిన యాత్రికులకు ఈ నెల 23వ తేదీన ముందస్తు జాగ్రత్తగా టీకాలను పంపిణీ చేయనున్నట్లు ఆమె వివరించారు. యాత్రకు వెళ్లే మొత్తం 340 మందికి న్యూమోకొకల్ మెనింజైటిస్ టీకాలను ఇవ్వడంతో పాటు, 60 ఏళ్లు పైబడిన 56 మంది వృద్ధ యాత్రికులకు ప్రత్యేకంగా ఇన్ఫ్లుఎంజా టీకాలను వేయనున్నట్లు స్పష్టం చేశారు. యాత్ర సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఈ టీకాలు రక్షణ కల్పిస్తాయని, యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, జిల్లా టీకాల నియంత్రణ అధికారి డాక్టర్ అశోక్, పలువురు వైద్యులు మరియు ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.


