ఈ నెల 17న టీయూలో మెగా జాబ్ ఫెయిర్
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సహకారంతో ఈ నెల 17న డిచ్‌పల్లి క్యాంపస్‌లో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు జాబ్ ఫెయిర్‌కు సంబంధించిన పోస్టర్లను వైస్ ఛాన్సలర్ ప్రొ. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మెగా జాబ్ ఫెయిర్‌లో 500కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, అర్హులైన అభ్యర్థులను ఆయా సంస్థలు ఎంపిక చేస్తాయని తెలిపారు. స్థానిక విద్యార్థులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాతో హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, ప్లేస్‌మెంట్ సెల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

