వంద స్తంభాల ఆలయాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు
భూమి ఆక్రమణలపై సర్వే జరుపుతామని హామీ
బోధన్ పట్టణంలోని ప్రాచీన రక్షిత కట్టడమైన వంద స్తంభాల ఆలయ సంరక్షణకు తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ చర్యలు చేపట్టింది. బుధవారం పురావస్తు శాఖ అధికారులు ఆలయాన్ని సందర్శించి, క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఆలయ నిర్మాణాలు, శిథిలమైన భాగాలు, పరిసరాల్లో ఉన్న ప్రాచీన అవశేషాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఆలయ రక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయం చుట్టూ రక్షణ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు భద్రత కోసం వాచ్‌మెన్‌ను నియమించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. ఆలయానికి చెందిన 1 ఎకరం 10 గుంటల భూమిలో ఆక్రమణలు జరిగాయన్న స్థానికుల ఫిర్యాదుపై స్పందిస్తూ.. రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో సమగ్ర సర్వే జరిపి భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. మన సంస్కృతికి ప్రతీకలైన చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యోగ్ ధారణ ఫౌండేషన్ ప్రతినిధి ఉదయ్ మహారాజ్, సాయి ప్రసాద్, ధర్మ తదితరులు పాల్గొన్నారు.


