జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 

జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 

 

సమాజంలో చైతన్యానికి ప్రతిరూపాలుగా, అక్షర సైనికులుగా నిలిచే జర్నలిస్టుల కష్టాలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పాత్రికేయుల చిరకాల స్వప్నమైన ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్‌లో సోమవారం జరిగిన నిజామాబాద్ అర్బన్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.  ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టులు నాలుగో స్తంభంగా విరాజిల్లుతున్నారని ఆ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. వార్తల సేకరణలో వాస్తవాలకు ప్రాధాన్యతనిస్తూ, పేదల గొంతుకగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్పీ రేటింగ్‌ల మాయలో పడకుండా, సామాజిక బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులే వారధులని ఆయన కొనియాడారు. కలుషితమవుతున్న కొందరు రాజకీయ నేతలను తమ కలం పోరాటంతో గాడిలో పెట్టాల్సిన బాధ్యత మీడియాపై ఉందని ఆయన గుర్తు చేశారు.
కేశాపూర్‌లో స్థలాల పరిశీలన.. 
నిజామాబాద్ నగర జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల అంశాన్ని తాను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకున్నానని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, సాధ్యసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పారు. ముఖ్యంగా నగర శివారులోని కేశాపూర్ వద్ద గల ప్రభుత్వ భూమిని జర్నలిస్టులకు కేటాయించే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఆర్డీవోలతో నేడే సుదీర్ఘంగా చర్చించి తదుపరి కార్యాచరణను ఖరారు చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో జర్నలిస్టుల వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జర్నలిస్టుల హెల్త్ కార్డుల పునరుద్ధరణ, ఇతర సంక్షేమ పథకాల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన వివరించారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, ఎమ్మెల్సీగా జర్నలిస్టుల ప్రతి సమస్యపై తాను పోరాడుతానని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ ప్రసంగిస్తూ, పాత్రికేయుల కృషిని అభినందించారు.
కొత్త కార్యవర్గం బాధ్యతలు
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పంచ రెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా వాగ్మరే సుభాష్, కోశాధికారిగా రాజ్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శిగా బొత్స రాజుతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశ వేణు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Views: 20
Tags:

About The Author

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు