బాలల రక్షణే పోలీసుల ప్రాధాన్యత : నేరగాళ్లకు ఫోక్సోతో కఠిన శిక్షలు
చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఫోక్సో చట్టాన్ని తీసుకువచ్చిందని, దీనిపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ నాల్గవ టౌన్ ఎస్.హెచ్.ఓ సతీష్ అన్నారు. పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం బోర్గం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్న వయసు నుంచే ఇతరుల స్పర్శలోని ఉద్దేశాన్ని (గుడ్ టచ్, బ్యాడ్ టచ్) గుర్తించాలని సూచించారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఏమాత్రం భయపడకుండా వెంటనే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు సమాచారం అందించాలని కోరారు.
బాధితులకు అండగా నిలిచేందుకు నిజామాబాద్ భరోసా సెంటర్ ద్వారా ఉచిత వైద్య, న్యాయ సహాయంతో పాటు కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు భరోసా ప్రతినిధులు వివరించారు. మైనర్లపై వేధింపులకు పాల్పడే వారికి ఫోక్సో చట్టం కింద పడే కఠిన శిక్షల గురించి షీ టీం సభ్యులు విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో లేదా వేధింపులకు గురైనప్పుడు వెంటనే డయల్ 100 లేదా షీ టీం వాట్సాప్ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని, బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్-4 ఎస్.ఐ సందీప్, భరోసా సెంటర్ అధికారి రోజా, షీ టీం ఇన్చార్జ్ స్రవంతి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


