మున్సిపల్ కార్మికుని అంత్యక్రియల సహాయం కోసం నిరసన
అధికారులు దిగొచ్చి నగదు అందించడంతో శాంతించిన కార్మికులు
బోధన్ మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుడు శివలింగం అనారోగ్యంతో బుధవారం మృతి చెందగా, ఆయన అంత్యక్రియల సహాయం అందించడంలో అధికారులు తాత్సారం చేయడంపై తోటి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శివలింగం మరణవార్త తెలుసుకున్న కార్మికులు అంత్యక్రియల ఖర్చుల కోసం మున్సిపల్ అధికారులను ఆశ్రయించారు. అయితే నగదు మంజూరులో అధికారులు జాప్యం చేయడంతో తీవ్ర అసంతృప్తి చెందిన కార్మికులు టీయూసీఐ, సీఐటీయూ నాయకులకు సమాచారం అందించారు. నాయకులు మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్ ద్వారా మాట్లాడగా.. పంపిస్తామని చెప్పినప్పటికీ సమయానికి చెల్లింపులు జరగలేదు. ఆర్డీవోతో మాట్లాడిన తర్వాతే ఇస్తామని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన కార్మికులు అంత్యక్రియలను నిలిపివేశారు. మృతదేహంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు తక్షణమే మృతుని ఇంటికి చేరుకుని అంత్యక్రియలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, ఆయన భార్యకు ఔట్‌సోర్సింగ్‌లో ఉద్యోగం కల్పించాలని నాయకులు కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మృతి చెందిన కార్మికుల వారసులకు ఉద్యోగం కల్పించే అవకాశముందని కమిషనర్ తెలిపారు. ఇప్పటికే మృతిచెందిన, పదవీ విరమణ పొందిన 16 మంది కార్మికుల వారసుల దస్త్రాలను సిద్ధం చేసి ఆమోదం కోసం హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు పంపినట్లు వివరించారు. అర్హులైన వారందరికీ ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషనర్ హామీతో ఆందోళన విరమించిన కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి శివలింగం అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర నాయకుడు బి.మల్లేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జే.శంకర్ గౌడ్, పట్టణ కార్మిక నాయకులు బి.పర్వయ్య, గంగామణి, పోశెట్టి, గంగాధర్, భూమయ్య, రాణి, లావణ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

