ఆధ్యాత్మికతకు నిలయం.. రంజాన్ మాసం
బోధన్ ఇఫ్తార్ విందులో సీపీ సాయి చైతన్య
రంజాన్ మాసం కేవలం ఉపవాసాలకే పరిమితం కాదని, మనసును పరిశుభ్రం చేసుకునే ఆత్మపరిశీలన కాలమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పేర్కొన్నారు. బుధవారం బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ జామ మసీదు కమిటీ అధ్యక్షుడు మహబూబ్ గుల్షానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముక్తి జావేద్ నిర్వహించిన ప్రత్యేక దువాలో పాల్గొన్న సీపీ, అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పవిత్ర మాసంలో నిర్వహించే ఉపవాసాలు మనిషిలో నియమం, సహనం, క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. పేదల పట్ల కరుణాభావం, దానధర్మాలు, సోదరభావం వంటి విలువలు ఈ మాసంలో ప్రతి ఒక్కరిలో వెల్లివిరుస్తాయని తెలిపారు. అల్లా కృపతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంతో మెలిగి బోధన్ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐలు వెంకటనారాయణ, విజయబాబు, కృష్ణ, ఎస్సై హబీబ్, మసీద్ కమిటీ సభ్యులు సయ్యద్ జాకీర్, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ పిలుపు మేరకు ఇఫ్తార్ విందుకు విచ్చేసిన సీపీకి కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

