ఒకే రోజు రెండు ఇసుక వాహనాల పట్టివేత
సాలూర మండల పరిధిలో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు వాహనాలను గురువారం రెవెన్యూ అధికారులు పట్టుకున్నారని తహసీల్దార్ అజ్మత్ నవాజ్ తెలిపారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ వాహనాలు దొరికినట్లు పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఖాజాపూర్ మంజీరా నదీ శివారు ప్రాంతం నుంచి బోధన్ వైపు ప్యాసింజర్ ఆటోలో సంచుల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా సాలూర క్యాంప్ వద్ద రెవెన్యూ ఉద్యోగి సంజీవ్ గురువారం ఉదయం నిఘా ఉంచి పట్టుకున్నారు. అలాగే సాయంత్రం వేళ ఖాజాపూర్ వద్ద రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శంకర్ తనిఖీలు నిర్వహిస్తుండగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్న ఒక టాటా మ్యాజిక్ ఆటో దొరికింది. దీంతో అధికారులు ఈ రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా మంజీరా నదీ తీరం నుంచి ఇసుకను తోడి అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తహసీల్దార్ ఈ సందర్భంగా హెచ్చరించారు. మండల పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, చట్టాన్ని ఉల్లంఘిస్తే వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

