ఫీజు బకాయిల విడుదల కోసం పోరాటం
15న ధర్నా చౌక్‌లో ఫీజు పోరు దీక్ష
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ఫీజు పోరు దీక్ష చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ ప్రకటించారు. నిజామాబాద్‌లోని కార్యాలయంలో ఈ దీక్షకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరాల సుధాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తోందని, దీనివల్ల బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యకు తీవ్ర ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ దీక్షలో విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ.. పేదలకు ఉచిత విద్య, వైద్యం అందుబాటులో ఉంటేనే వారు సుఖసంతోషాలతో ఉంటారని, వారికి మరే ఇతర సహాయం అవసరం ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిధులను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, సాయి బసవ, బగ్గలి అజయ్, రేఖ, కోడూరు స్వామి, సురేందర్, శ్రీకాంత్, రుక్మిణి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

