మున్సిపల్ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి
ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పుట్ట వరదయ్య డిమాండ్
నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పుట్ట వరదయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం, అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
నేరుగా ఖాతాల్లోనే జమ చేయాలి
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా, కార్మికుల జీవితాల్లో మార్పు రావడం లేదని వరదయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నెలలో వారం రోజులు గడిచినా వేతనాలు వేయకపోవడం వల్ల కార్మికులు పూట గడవని స్థితిలో ఉన్నారని విమర్శించారు. ఏజెన్సీలకు సంబంధం లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లోనే వేతనాలు జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అధికారుల తీరుపై మండిపాటు
"గ్రూపులుగా ఏర్పడితేనే వేతనాలు ఇస్తాం" అంటూ అధికారులు కార్మికులను ఆందోళనకు గురిచేయడం సరికాదన్నారు. వేతనాల చెల్లింపులో జాప్యం చేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు విడుదల చేయాలని, లేనిపక్షంలో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

